మేధావి వర్గానికి ప్రతినిధులమని నిరూపించుకుందాం.

మితృలారా! ఉపాధ్యాయులు మేధావి వర్గానికి ప్రతినిధులు. అందుకనే ఏ ప్రభుత్వ ఉద్యోగికీ తమ ప్రతినిధిగా ఒకరిని శాసన మండలికి పంపించే అవకాశం లేని హక్కు మనకే ఉంది. అదే మనందరం ఓటు వేసి ఒకరిని మండలికి పంపించాలి. ఆ అవకాశం ఈనెల 22న మనకు మళ్లీ రానుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
పోరాడి సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. కాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత కూడా విద్యా రంగం ప్రైవేటు పరమే అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ లో 14శాతం నిధులు కేటాయించిన రోజులున్నాయి. కాని తెలంగాణ ప్రభుత్వం దానిని 7శాతానికి తగ్గించి వేసింది. సర్వీసు రూల్స్ లేక పర్యవేక్షణాధికారుల పోస్టులు 90శాతం ఖాళీగా ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడం వలన బోధన అస్తవ్యస్తంగా తయారయింది. దీనిని ప్రశ్నించాలా, వద్దా? ప్రస్తుత మన ఎంఎల్సీ లు ఎప్పుడైనా ప్రశ్నించారా? అలా ప్రశ్నించని వారినే మళ్లీ ఎన్నుకుందామా?
ఉపాధ్యాయుల సమస్యలను గాలికొదిలేసారు. రెండు పేజీల సర్వీసు రూల్స్ రాసుకోవడానికి ఐదేళ్ల కాలం సరిపోలేదు. ఇంకెంత కాలం కావాలో! సిపియస్ రద్దుకు ఇంకెంత పోరాటం చేయాలో, పండిత్ పిఈటీలకు పదోన్నతులు ఎన్నడో, 398 వేతనం తో పనిచేసిన కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఎన్నడో, ఇలా చెబుతూ పోతె సమస్యలెన్నో. ఇవి సాధించు కోవాలంటే పోరాటాల ద్వారానే సాధ్యం. మరి పోరాడేవారెవరో గుర్తించాల్సిన సమయం ఇది. సిపియస్ విధానమే ఉద్యోగులకు లాభదాయకమన్నపుడు,
మన ఉపాధ్యాయినులకు బ్యాగులు సర్దుకోవడానికే సమయం పడుతుందన్నపుడు నోరు మెదపని వారిని మళ్లీ ఎన్నుకుందామా? ఒకే సంఘానికి చెందిన ఇద్దరు ప్రతినిధులు వేరువేరుగా పోటీ చేస్తుంటే ఆ సంఘ సభ్యులెవరి వైపున ఉన్నట్లు? ఉపాధ్యాయ వృత్తిలో వచ్చే వేతనం కన్నా చేస్తున్న వ్యాపార ఆదాయం ఎక్కువ కాబట్టి వృత్తిని వదిలేసి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అని నమ్మబలుకుతున్న వారి మాటలనెంతవరకు నమ్ముదాం? జీవితాంతం ఉద్యమంలో ఉన్నవారిని కాకుండా మూటలు మోసుకుని వచ్చే వారిని నిలబెట్టే సంఘాలను ఎలా నమ్ముదాం? రెండేళ్ల క్రితం హైదరాబాద్ నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్నపుడు కూడా ఇలాగే ఒక వ్యక్తిని నిలబెట్టారు. ఎన్నికలు అయిన తరువాత ఆయన కంటికి కనబడటం లేదు. అలాంటి వారిని ఎలా ఎన్నుకోగలం? స్వీయ ప్రయోజనాలకొరకు సంఘాలను చీల్చి తమదే అసలు సిసలైన సంఘం అంటూ చెప్పే వారు నిలబెట్టిన ప్రతినిధులు గతంలో చేసిన కృషి ఏమిటో ఒక్కసారి అంచనా వేద్దాం.
ఒక్కసారి ఇప్పటిదాకా పని చేసిన ఎంఎల్సీ ల పనితీరుని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఎవరు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేయగలరో, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేయగలరో ఆలోచిద్దాం. ఆలోచించి మేధావి గా నిర్ణయం తీసుకుందాం. మేధావి వర్గానికి ప్రతినిధులమని నిరూపించుకుందాం.

పండిత్, పిిఇటి ల ఉన్నతీకరణ

తెలంగాణ రాష్ట్రం లోని అన్ని పాఠశాలలలో పనిచేస్తున్న పండిత్ పిఇటిలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా సంతోషించదగిన పరిణామం. ఏవిధంగా ఉన్నతీకరణ చేస్తున్నారనేదానిపై పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ ఇప్పటిదాకా భావిస్తున్నట్లు మొదట పోస్టులను అప్ గ్రేడ్ చేసి అర్హతగల వారికి పదోన్నతులు కల్పించాలనే విధంగా కాకుండా, ఎక్కడి వారిని అక్కడనే ఉన్నతీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా మంచి పరిణామమే. కానీ, ఇక్కడే ఎస్ జి టీలనుండి విమర్షలు వస్తున్నాయి. ఇప్పటిదాకా వారు ఊహించుకున్న విధంగా కాకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు.